సందేహం
"ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడ బడుచుందురు?"... 1 రాజులు 18:21
సందేహాన్ని గురించి వివరించే కథ ఒకటి విన్నాన్నేను. ఒక రోగి వున్నాడు. తన శరీరానికి సంబంధించి వాక్యాన్ని ఒప్పుకుంటున్నాడు. స్వస్థతకు సంబంధించిన లేఖన భాగాలను స్మరించుకుంటూ, ప్రత్యక్షపరచబడబోయే తన స్వస్థతకు వాటిని నమ్ముతూ వున్నాడు. అలనమ్ముతూ వుండగా అప్పుడప్పుడు సందేహంతో కూడిన ఆలోచనలతనిలో కలుగుతూ ఉన్నాయి.
ఎంతోసేపు అలా వాటితో కష్టపడిన తర్వాత అతడు నిరుత్సాహపడ్డం మొదలు పెట్టినప్పుడు దేవుడు ఆత్మలోకానికి అతని కళ్ళు తెరిచాడు. అక్కడ ఒకదయ్యం అతనితో అబద్దాలు చెబుతోంది. నీవు స్వస్థపడవు. వాక్యాన్ని అంగీకరించడం వల్ల నీకేం పని జరుగదు అని చెబుతుందా దయ్యం. అయితే అతడు వాక్యాన్ని అంగీకరించినప్పుడల్లా ఒక వెలుతురు ఖడ్గంలా అతని నోటినుండి వస్తోంది. ఆ వెలుతురుకు దయ్యం భయంతో వంగిపోతూ వెనుకకు పడిపోవడం కూడా అతడు చూశాడు.
దేవుడతనకీ దర్శనం చూపించిన తర్వాత వాక్యాన్ని మాట్లాడుతూ వుండడం ఎంత ముఖ్యమో అతడు అర్ధం చేసుకోగలిగాడు. అతనితో విశ్వాసం వుంది గనుక దయ్యం అతనిపై సందేహం అనే ఆయుధంతో దాడిచేస్తోంది.
సందేహం అనేది దేవుడు మనలో కలిగించేదికాదు. దేవుడు ప్రతి వ్యక్తికీ .... "విశ్వాస పరిమాణాన్ని ఇచ్చాడు" అని బైబిలు వివరిస్తోంది (రోమా 12:3). దేవుడు మన హృదయాల్లో విశ్వాసాన్ని ఉంచాడు. కానీ మనలో సందేహాన్ని కలిగించి ఆ విశ్వాసాన్ని తీసివేయాలని ప్రయత్నిస్తున్నాడు సాతాను.
అనుమానం అనేది దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనల రూపంలో వస్తుంది. అందుకనే దేవుని వాక్యం తెలుసుకోవడం మనకెంతో ముఖ్యం. మనకుగాని వాక్యం తెలిస్తే సైతాను మనతో అబద్దాలు చెబుతున్నాడని గ్రహించగలం. యేసు తన మరణ పునరుత్తనాలతో మన కొరకు దేన్నీ కొన్నాడో మననుండి దాన్ని దొంగిలించాలని అతడు అబద్దాలు చెబుతాడని స్థిరంగా తెలుసుకోవాలి.

No comments:
Post a Comment